జూబ్లీహిల్స్ డైలీ రిపోర్ట్ ,ప్రత్యేక ప్రతినిది ;
Jubilee Hills By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకూడదని వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నియోజవర్గంలో నాలుగు లక్షల మంది ఓటర్లున్నా అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నాయి.
2009లో 52.76 శాతం, 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023లో 47.49 శాతం ఓట్లు పోలవడమే తాము ఇలా విశ్లేశించడానికి కారణమని చెబుతున్నారు. అంటే మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే. 7 డివిజన్లు ఉన్న హిల్స్‌ను గుప్పెట పట్టేందుకు పార్టీలు బలగాలను మోహరించాయి. ఏ ఓటరు ఎక్కడున్నారు. ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు మళ్లుతాయనే వ్యూహాలు ఇక్కడ గంట గంటకూ పదును తేలుతున్నాయి.
ఎన్నికల కోసం శ్రమిస్తున్న పార్టీల అభ్యర్థులు : ఈ నెల 11న జరిగే ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి సునీత గోపినాథ్, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలోకి దిగగా ఆయా పార్టీలు అభ్యర్థుల విజయం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రచారం చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇతర నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బస్తీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండల్లో మైనారిటీలు కీలకం : ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువ ఓటర్లు ఉన్న రహమత్‌నగర్, ఎర్రగడ్డ, షేక్‌పేట డివిజన్లే ప్రధానంగా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నారు. ఆ తర్వాత మైనారిటీ ఓటర్లు ఉన్న బోరబండకూ ప్రత్యేక స్థానం ఉంది. పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ కాలనీలు, బస్తీలు, మురికివాడలే అధికం. రహమత్‌నగర్ దాదాపు 70 వేల ఓట్లు ఉన్నట్లు అంచనా. గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ముందు నిలిచింది. లోక్‌సభకు వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుంది. ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండల్లో మైనారిటీలు కీలకం. ఈ నియోజకవర్గం మొత్తంలో 1.10లో లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉంటారని పార్టీలు అంచనా వేస్తుండగా ఈ నాలుగు డివిజన్ల పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో : ఈ ఉప ఎన్నికలో బీసీ ఓటు కూడా కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ల అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తున్నారు. వెంగళరావునగర్, సోమాజిగూడ, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో పలు చేతివృత్తుల కాలనీలు ఉన్నాయి. మున్నూరుకాపులు, గౌడలు, యాదవులు తదితర బీసీ వర్గాల ఓట్లు ఉప ఎన్నికలో ప్రధానమవుతున్నాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా బీసీలు ఉన్నారు.
ఈ నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలు వివిధ పార్టీల కింద విస్తరించి ఉన్నారు. పార్టీల నాయకులు ఆయా సంఘాల నేతలను పిలిపించుకుని చర్చిస్తున్నారు. వెంగళరావునగర్తోపాటు సోమాజిగూడ డివిజన్ గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో ఒకేచోట పెద్ద సంఖ్యలో ఓటర్లు నివసిస్తున్నారు. దీంతో పలు సంఘాల వారితో కొందరు పార్టీ బాధ్యులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొన్ని కాలనీలకు చెందిన ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతోనూ మాట్లాడుతున్నారు.









