తెలంగాణ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ;CM Responds on Rangareddy Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ ప్రమాదంపై సీఎస్, డీజీపీతో ఫోన్లో మాట్లాడిన సీఎం, ప్రమాద వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలను రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైన వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనా స్థలికి వెళ్లి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు.
సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల అధికారులను సీఎస్ రామకృష్ణారావు అలర్ట్ చేశారు. వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్లు 99129 19545, 94408 54433
మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి : ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారన్నారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశాలిచ్చారు.
ప్రమాదంపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి : రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచి వేసిందని చంద్రబాబు ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణిని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.









