టిప్పర్​ రాంగ్​ రూట్​లో రావడం వల్లే ప్రమాదం : మంత్రి పొన్నం

తెలంగాణ బ్యూరో ,డైలీ రిపోర్ట్

Minister Ponnam on Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి కలెక్టర్​, ఆర్టీసీ ఎండీలతో మంత్రి పొన్నం ఫోన్​లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టిప్పర్​ లారీ రాంగ్​ రూట్​లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారని చెప్పారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశాలిచ్చారు.

మంత్రి పొన్నం వివరణ : రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్​ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించి తగిన ఆదేశాలిచ్చామని చెప్పారు. 72 మంది ప్రయాణికులతో బస్సు వస్తుండగా కంకర టిప్పర్​ ఢీకొట్టిందన్నారు. మృతుల కుటుంబాలకు సాయం కోసం అధికారులను ఏర్పాటు చేశామని వివరించారు. అంతకు ముందు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను మంత్రి పొన్నం పరామర్శించారు.

ఎమ్మెల్యే యాదయ్యపై దాడికి యత్నం : బస్సు ప్రమాదస్థలం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన ఎమ్మెల్యే యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే యాదయ్యపై దాడికి యత్నించారు. అనంతరం ఎమ్మెల్యే డౌన్​డౌన్​ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

అసలేం జరిగింది? : చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో అక్కడ హృదయవిదారక వాతావరణం నెలకొంది.

అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్​ శ్రీధర్​కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో గాయాలు కాగా, అతనని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్​ రాధకు స్వల్ప గాయాలు కాగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బస్సులో చిక్కుకున్న వారిలో 15 మందిని సిబ్బంది బయటకు తీశారు.

తాండూరు నుంచి హైదరాబాద్​ వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చి పూర్తిగా ఆర్టీసీ బస్సుపైకి కంకర లారీ ఒరిగింది. బస్సులోని ప్రయాణికులపై లారీలో ఉన్న కంకర పడింది. దీంతో ఆ కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయారు. మూడు జేసీబీల సహాయంతో సహాయచర్యలు చేపట్టారు. హైదరాబాద్​-బీజాపూర్​ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాపిక్ జాం అయింది. ఈ ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపోకు చెందింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :