ఇంటర్నేషనల్ /ఆఫ్ఘనిస్తాన్ ,డైలీ రిపోర్ట్ ;
Afghanishtan Earthquake : అఫ్గానిస్థాన్‌ను మరోసారి వరుస భారీ భూకంపాలు వణికించాయి. ఈ ఉదయం ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని మజార్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 10 మరణించగా, సుమారు 260 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అంతకుముందు 10 కిలోమీటర్ల లోతులో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు చెప్పారు.
మజార్-ఇ-షరీఫ్ సమీపంలోని 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు US జియోలాజికల్ సర్వే తెలిపింది. తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కేమెనిస్థాన్ సరిహద్దు దేశాల్లోనూ భూకంప ప్రభావం ఉన్నట్లు చెప్పింది. భూకంపం నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఘోర విపత్తు కారణంగా మజార్-ఎ షరీఫ్ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వివరించారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన భారీ భూకంపంలో 1,400 మందికి పైగా మృతి చెందారు. మరో 3వేల మంది గాయపడినట్లు చెప్పారు. భూకంపం ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు వల్ల దాదాపు 12,000 మంది ప్రత్యక్షంగా ప్రభావితులైనట్లు తెలిపారు. మయన్మార్‌లో 4.5తీవ్రతతో భూకంపం
మరోవైపు మయన్మార్‌లో కూడా 4.5తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.03 గంటల సమయంలో 90 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. అంతకుముందు శనివారం కూడా 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఉదయం 11గంటల సమయంలో 37 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు తెలిపింది.









