ఎర్రకోట బాంబు పేలుడు సహకుట్రదారు జసీర్‌కు 10 రోజుల ‘ఎన్‌ఐఏ’ కస్టడీ

న్యూఢిల్లీ ,డైలీ రిపోర్ట్ ;

Delhi Bomb Blast Red Fort : ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడులో సహకుట్రదారు జసీర్‌ బిలాల్‌ను దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 10 రోజుల NIA కస్టడీకి అనుమతించింది. NIA అభ్యర్థన మేరకు న్యాయమూర్తి జస్టిస్ అంజూ బజాజ్ చంద్నా కస్టడీకి అనుమతి ఇచ్చారు. జసీర్‌ బిలాల్‌ను కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. అనంతనాగ్ జిల్లా కాజీగుండ్ నివాసి అయిన జసీర్‌ను సోమవారం శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. కారు బాంబు ఘటనకు ముందు జసీర్‌ సాంకేతిక సహాయం అందించినట్టు NIA తెలిపింది. డ్రోన్లలో మార్పులు చేయడంతో పాటు, రాకెట్లను తయారీ చేసేందుకు ప్రయత్నించాడని పేర్కొంది.

ఉగ్ర కుట్ర కేసులో అరెస్టైన నిందితుల సమాచారం ఆధారంగా శ్రీనగర్ పోలీసులు ఇప్పటికే జాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను గతేడాది అక్టోబర్‌లో కుల్గాంలో ఉగ్ర నెట్‌వర్క్‌ సభ్యులను కలిశానని, అక్కడి నుంచి తనను అల్ ఫలా విశ్వవిద్యాలయంలోని అద్దె వసతి గృహానికి తీసుకెళ్లారని జాసిర్‌ తెలిపాడు. “నన్ను ‘జైషే మహమ్మద్‌’ ఉగ్రసంస్థకు సహాయకుడిగా (ఓవర్ గ్రౌండ్ వర్కర్)గా ఉంచాలని టెర్రర్‌ మాడ్యూల్‌లోని ఇతర సభ్యులు కోరుకున్నారు. కానీ, ఉమర్ మాత్రం నన్ను ఆత్మాహుతి బాంబర్‌గా మారేలా ఒప్పించేందుకు చాలా నెలలు ప్రయత్నించాడు” అని జాసిర్‌ వివరించాడు. అయితే వివిధ కారణాలతో జాసిర్‌ వెనక్కి తగ్గడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు.

మరో కీలక నిందితుడు అమీర్ రషీద్ అలీకి 10 రోజుల కస్టడీ
అంతకుముందు సోమవారం ఈ కేసులో మరో కీలక నిందితుడు అమీర్ రషీద్ అలీని కూడా 10 రోజుల NIA కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ప్రధాన నిందితుడు నబీకి ఆశ్రయం కల్పించడంతో పాటు, లాజిస్టిక్ సపోర్ట్ అందించినట్టు కోర్టుకు NIA తెలిపింది. డాక్టర్‌ ఉమర్‌ నబీతో చిట్టచివరిగా మాట్లాడిన వ్యక్తిగా భావిస్తున్న అమీర్ రషీద్​ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్లీ ప్రధాన జిల్లా-సెషన్స్‌ న్యాయస్థానంలో సోమవారం హాజరుపరిచారు. నిందితుడిని పదిరోజుల విచారణ నిమిత్తం అప్పగించాలని NIA కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. ఆత్మాహుతి బాంబర్‌గా మారిన నబీతో కలిసి అతడు కుట్ర చేసినట్లు ఆరోపిస్తూ ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అలీని కశ్మీర్‌కు తీసుకువెళ్లి లోతుగా ప్రశ్నిస్తామని అధికారులు తెలిపారు. నవంబర్​ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.

జసిర్‌ తండ్రి నిప్పంటించుకుని ఆత్మహత్య!
మరోవైపు ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జసిర్‌తోపాటు అతడి తండ్రి, డ్రైఫ్రూట్స్‌ విక్రేత బిలాల్‌ అహ్మద్‌ వనీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించిన అనంతరం వదిలిపెట్టారు. అయితే, ఆదివారం ఆయన తనకు తాను నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :