ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్​రావుకు సిట్ నోటీసులు

హైదరాబాద్ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 27;

ఫోన్​ ట్యాపింగ్​ కేసు ఇప్పటికే తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిట్​ తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్​రావుకు నోటీసులు జారీ చేసింది. నేడు  మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సీఆర్పీసీ 160వ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. ఇప్పటికే సిట్​ అధికారులు బీఆర్​ఎస్​ సీనియర్​ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారణ చేసిన సంగతి తెలిసిందే. బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలను సిట్ విచారణ చేసింది.

అన్నింటికి సమాధానం ఇస్తా : సిట్​ ఇచ్చిన నోటీసులపై బీఆర్​ఎస్​ నేత సంతోష్​ రావు స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, రేపటి విచారణకు హాజరవుతానని తెలిపారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.                                                                           రెండేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలోని సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే మూడు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచారు. అంతకు ముందు బీఆర్​ఎస్ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావును విచారణ చేశారు.

వేగం పెంచిన సిట్ : వాస్తవానికి కేసు నమోదై దాదాపు రెండేళ్లు కావస్తున్నా దర్యాప్తు మాత్రం ఇంకా టీవీ సీరియల్​లా కొనసాగుతూనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో పోలీసు అధికారులే నిందితులుగా ఉన్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్​ రావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్​ రావులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. హరీశ్​ రావు, తర్వాత కేటీఆర్, ఇప్పుడు సంతోష్ రావు, చివరగా మాజీ సీఎం కేసీఆర్​కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును ముగించాలనే ఉద్దేశంతో సిట్​ వేగం పెంచినట్లు కనిపిస్తోంది.

అసలేంటీ ఈ ఫోన్​ ట్యాపింగ్ కేసు : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పలు రాజకీయ పార్టీల అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని ఫోన్​ ట్యాపింగ్ జరిగిందనే అంశం మొదట్లో తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసు ఉన్నతాధికారులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. వారిలో ప్రభాకర్​రావు, రాధాకిషన్​ రావు, తిరుపతన్న, ప్రణీత్​ రావులు ఉన్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్​గా వ్యవహారించిన ప్రభాకర్​రావుపై ఈ కేసులో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆయన వల్లే ఈ కేసు సుదీర్ఘంగా కొనసాగుతుందని ప్రచారం ఉంది.

వాంగ్మూలాల సేకరణ : దీంతో ఈ కేసును సీరియస్​గా తీసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ దర్యాప్తును వేగంగా చేపట్టింది. అందులో భాగంగా ఫోన్​లు ట్యాప్​ అయిన నేతలు ఈటల రాజేందర్, మహేశ్​ కుమార్​ గౌడ్, బండి సంజయ్ తదితర నాయకులను పిలిచి వారి నుంచి కీలక వాంగ్మూలం తీసుకుంది. తాజాగా బీఆర్​ఎస్​ కీలక నేతలను విచారణ చేస్తున్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసును కాంగ్రెస్​ ప్రభుత్వం సీరియల్​ నడుపుతున్నాయని రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేకపోయారని కేంద్రమంత్రి బండి సంజయ్​ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే కేసీఆర్ కుటుంబం మొత్తం జైళ్లో ఉండేదని ఘాటుగా విమర్శించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :