హైదరాబాద్​లో ఇల్లు కొంటున్నారా? – కొత్తగా వచ్చిన ఈ సమస్య గురించి తెలుసుకోండి

హైదరాబాద్ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 27;

హైదరాబాద్​ నగర విస్తరణతో పాటు పాలనా సౌలభ్యం కోసం చేపట్టిన డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు సామాన్య ప్రజలకు పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా ఇళ్లు, ఖాళీ స్థలాల కొనుగోలు, అమ్మకాలపై ఈ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధికారులు కొత్త హద్దులు నిర్ణయించినప్పటికీ, ఆస్తి సంబంధిత రికార్డులను కొత్త డివిజన్లకు పూర్తిగా బదిలీ చేయకపోవడం వల్ల సమస్య మరింత సంక్లిష్టంగా మారింది.

పాత డివిజన్లు – కొత్త హద్దులు : పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 డివిజన్లు మాత్రమే ఉండేవి. అయితే ఇటీవల శివారు ప్రాంతాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసి నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఈ క్రమంలో సుమారు 250 డివిజన్లు పూర్తిగా కొత్త హద్దులతో ఏర్పడ్డాయి. ఈ మార్పుల కారణంగా అనేక బస్తీలు, కాలనీలు ఒక డివిజన్‌ నుంచి మరో డివిజన్‌కు మారిపోయాయి. అంచనా ప్రకారం ఇలాంటి ప్రాంతాల్లోని ఇళ్లు, స్థలాలు 5 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు.

మ్యుటేషన్‌ ఆగిపోవడంతో లావాదేవీలకు బ్రేక్‌ : సాధారణంగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే పాత యజమాని పేరు తొలగించి కొత్త యజమాని పేరుతో ఇంటి నంబరు మారుతుంది. అదే సమయంలో మ్యుటేషన్, ఆస్తి పన్ను మదింపు ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కానీ డివిజన్ల పునర్విభజన కారణంగా ఈ వ్యవస్థ స్తంభించింది. రిజిస్ట్రేషన్ జరిగినా మ్యుటేషన్ జరగడం లేదు. ఫలితంగా ఇళ్ల అమ్మకాలు నిలిచిపోవడంతో పాటు బ్యాంకు రుణాల మంజూరు కూడా ఆగిపోతోంది.

ఇంటి నంబర్లు, పౌరసేవల్లో జాప్యం : మ్యుటేషన్‌ సమస్య కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాలేదు. కొత్త ఇంటి నంబర్ల జారీ, ఆస్తి పన్ను అంచనా, నిర్మాణ అనుమతులు, పారిశుద్ధ్య సేవలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అనేక పౌరసేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకప్పుడు ఒకే సర్కిల్ కార్యాలయంలో పూర్తయ్యే పనుల కోసం ఇప్పుడు ప్రజలు పాత డివిజన్, కొత్త డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

అడ్వాన్సు చెల్లించిన కొనుగోలుదారుల కష్టాలు : ఈ గందరగోళంలో అత్యంత నష్టపోయేది అడ్వాన్సు చెల్లించిన కొనుగోలుదారులే. ఇల్లు కొనుగోలులో భాగంగా బయానా లేదా అడ్వాన్సు ఇచ్చిన తర్వాత మ్యుటేషన్ సమస్య ఉందని తెలిసినా, లావాదేవీ పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో విక్రేతలు అడ్వాన్సు డబ్బు తిరిగివ్వకపోవడంతో వివాదాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది పూర్తిగా జీహెచ్‌ఎంసీ పరిపాలనా లోపం వల్లే జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎల్బీనగర్‌ ఘటన ఒక ఉదాహరణ : పాత ఎల్బీనగర్‌ జోన్ పరిధిలోని ఒక కాలనీలో ఇటీవల ఓ కుటుంబం ఇల్లు కొనుగోలు చేసింది. ప్రస్తుత యజమాని ఆ ఇంటిని ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ మ్యుటేషన్ చేయించుకోలేదు. సగం డబ్బు చెల్లించిన తర్వాత ఈ విషయం కొనుగోలుదారులకు తెలిసింది. దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా, పునర్విభజన కారణంగా ఆ ప్రాంతం బడంగ్‌పేట్ డివిజన్‌కు మారిందని చెప్పి అక్కడికి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో కొనుగోలుదారులు తీవ్ర అయోమయంలో పడ్డారు.

పరిష్కారం ఇలా చేస్తే మేలు : ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే జీహెచ్‌ఎంసీ వెంటనే చర్యలు తీసుకోవాలని పలువులు అంటున్నారు. పునర్విభజన వల్ల సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాలను ప్రత్యేక యూనిట్లుగా ఏర్పాటు చేసి, వాటిని ప్రస్తుత సర్కిల్ కార్యాలయాల పరిధిలోని పన్ను రికార్డుల్లో చేర్చాలని, మ్యుటేషన్, ఆస్తి పన్ను, ఇంటి నంబర్ల ప్రక్రియను తాత్కాలికంగా అయినా పాత విధానంలో కొనసాగించేలా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :