తెలంగాణలో మోగనున్న “పురపోరు” నగారా..

హైదరాబాద్ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ,జనవరి 27;తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ పెరగనుంది. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచే సమయం వచ్చింది.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా అడ్డంకులు లేకపోతే షెడ్యూలు విడుదల ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈరోజు ( జనవరి 27, 2026 ) ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై తుది చర్చ జరపనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించడానికి, 13న ఓట్ల లెక్కింపు చేపట్టడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకాలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఎన్నికల షెడ్యూలు వెలువడనుందనే అంచనాతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :