ఏపీ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ;ఏపీ అసెంబ్లీ ఉద్యోగి బీకే మునిరాజాని (AP Assembly Employee Arrest) విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి విజయవాడ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, లైంగిక దాడులు, కుల దూషణలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, బ్లాక్ మెయిల్, ఫోర్జరీ కేసులో మునిరాజాని పోలీసులు అరెస్టు చేశారు. తల్లీ, కూతుళ్లను రెండేళ్లుగా లైంగికంగా, ఆర్థికంగా మునిరాజా వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే తూనికలు, కొలతల శాఖలో వసూల్ రాజాగా మునిరాజా ప్రసిద్ధిగాంచినట్లు పోలీసులు తెలిపారు.రెండేళ్ల పాటు విజయవాడ – I సర్కిల్‌లో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌గా మునిరాజా పని చేశాడు. వైసీపీ హయాంలో తనకు ఇన్‌స్పెక్టర్ పదవి ఇప్పించిన మంత్రి పీఏ చక్రవర్తి ద్వారా మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కూడా తన వసూళ్లలో వాటా ముట్టేదని మునిరాజా చెప్పాడు. అక్రమార్జనతో వచ్చిన ధన బలం, అధికార హోదా ఉపయోగించి ఇన్నాళ్లు మునిరాజా తప్పించుకు తిరిగాడు. బాధిత మహిళ న్యాయంకోసం కూటమి ప్రభుత్వంలోని పెద్దలను ఆశ్రయించింది. ప్రాథమిక విచారణలో బాధిత మహిళ సమర్పించిన ఆధారాలు నిర్ధారణ కావడంతో మునిరాజాని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.









