జాతీయం ,డైలీ రిపోర్ట్ ;
E Passport India : దేశంలో ఇప్పటివరకు దాదాపు 80 లక్షల ఈ- పాస్ పోర్ట్‌లు జారీ చేశామని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. గడువు ముగియని పాత పాస్ పోర్ట్‌లు 2035 వరకు లేదా వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారి ఒకరు కీలక విషయాలు వెల్లడించారు. “ఈ పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్ పీ) వెర్షన్ 2.0 ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో దాదాపు 80 లక్షల ఈ- పాస్ పోర్ట్‌లు జారీ అయ్యాయి. 2025 జూన్ నుంచి ఇప్పటివరకు దాదాపు 62,000 ఈ పాస్ పోర్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ఉన్నవారికి జారీ అయ్యాయి. ఒక వ్యక్తి ఈ-పాస్ పోర్ట్ పోయినా లేదా దొంగతనానికి గురైనా అతడి డేటాను ఎవరూ చోరీ చేయలేరు. పాస్ పోర్ట్ పోయినా లేదా దొంగతనం జరిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత ఈ పాస్ పోర్ట్ చిప్‌లోని మొత్తం డేటాను అధికారులు లాక్ చేస్తారు. అంతేకాకుండా ఈ పాస్ పోర్ట్‌లో ఉపయోగించే ఫోటో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.” అని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
80 లక్షల మందికి ఈ- పాస్ పోర్ట్‌లు
దేశంలోని పౌరులు, విదేశాల్లో నివసిస్తున్న వారి కోసం పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్ పీ వెర్షన్ 2.O), గ్లోబల్ పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (జీపీఎస్ పీ వెర్షన్ 2.0), ప్రధాన పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్ పీ) అప్ గ్రేడ్ వెర్షన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశంలో దాదాపు 80 లక్షల ఈ-పాస్ పోర్ట్‌లను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ-పాస్ పోర్ట్ అంటే ఏమిటి?
విదేశాల్లో ఈజీగా ఇమిగ్రేషన్, పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటాకు భద్రత కల్పించడం, నకిలీ పాస్ పోర్ట్‌లకు అడ్డుకట్ట వేయడం కోసం కేంద్రం ఈ- పాస్ పోర్ట్‌లను తీసుకొచ్చింది. అయితే ఈ-పాస్ పోర్ట్ ప్రక్రియ కొత్తేమీ కాదు. ఇప్పటికే 100కు పైగా దేశాలు తమ పౌరులకు ఈ-పాస్ పోర్ట్‌లను ఇస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాధారణ పాస్ పోర్ట్ తరహాలోనే ఈ-పాస్ పోర్ట్‌ను వాడుకోవచ్చు. డేటా భద్రత, విదేశాల్లో సులువైన ఇమిగ్రేషన్ ప్రక్రియ కోసం వీటిలో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చుతారు. ఇందులో పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, వయసు, చిరునామా వంటి వివరాలుంటాయి.
ఈ పాస్ పోర్ట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్, చిన్న యాంటెనా ఉంటుంది. ఈ చిప్‌లో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా పాస్ పోర్ట్ హోల్డర్ తాలుక డేటాను పొందుపరుస్తారు. గతంలో పాత పాస్ పోర్ట్స్ స్థానంలో నకిలీవి తయారుచేసేందుకు ఛాన్స్ ఉండేది. కానీ ఈ-పాస్ పోర్ట్‌లో అలాంటి అవకాశం లేదు. ఈ-పాస్ పోర్ట్‌తో ఇమిగ్రేషన్ లేదా ఇతరత్రా సమయాల్లో ప్రయాణికుడి వివరాలను వేగంగా వెరిఫై అయిపోతాయి.
ఈ-పాస్ పోర్ట్ పైలట్ ప్రాజెక్ట్‌ను కేంద్రం 2024లో భువనేశ్వర్, నాగ్‌పుర్‌లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాల్లో ప్రారంభించింది. ఈ ఏడాది మే నాటికి దశలవారీగా దేశంలోని మిగిలిన ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాల్లోనూ అమల్లోకి తెచ్చింది. దేశంలోని 37 పాస్ పోర్ట్ కార్యాలయాలతో పాటు, వాటి సంబంధిత 93 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 451 పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలలో పీఎస్ పీ వెర్షన్ 2.0 కార్యక్రమం ఈ ఏడాది మే 26న విజయవంతంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబరు 28న ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో గ్లోబల్ పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (జీపీఎస్ పీ వెర్షన్ 2.0) ప్రారంభమైంది.









