కేరళలోనూ గుజరాత్ సీన్ రిపీట్- త్వరలో అధికార మార్పు తప్పదు: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 23;

గుజరాత్‌లో కేవలం ఒక నగరంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం, ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్లిందని, ఇప్పుడు కేరళలోనూ అదే జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలే అందుకు నిదర్శనమని చెప్పారు. కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వ మార్పు తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరువనంతపురం నుంచి అమృత్‌ భారత్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును ప్రధాని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పాల్గొన్నారు.

ఈ రోజు ఇక్కడ నేను ఓ కొత్త ఆశను చూస్తున్నాను. మీలోని ఉత్సాహం చూస్తుంటే, కేరళలో నిజంగానే మార్పు వచ్చే అవకాశం ఉందని మాకు విశ్వాసాన్ని ఇస్తోంది. 1987కి ముందు, గుజరాత్‌లో బీజేపీ ఒక సాధారణ పార్టీగా ఉండేది. 1987లో మొదటిసారిగా బీజేపీ అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలుచుకుంది. సరిగ్గా ఈ రోజు మీరు తిరువనంతపురంలో గెలిచినట్లే. అక్కడి నుంచి గుజరాత్‌లో ప్రారంభమైన పరంపరలో, ప్రజలు మా పనిని చూశారు. మా పార్టీ ప్రవర్తనను అంచనా వేశారు. దాని ఫలితంగా, గత అనేక దశాబ్దాలుగా అక్కడి ప్రజలు మాకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక నగరంతో ప్రారంభమైంది. కేరళలో కూడా, ఇది ఒక నగరంతోనే ప్రారంభమైంది. అందుకే నేను చెబుతున్నాను. కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో మాతో జతకట్టారు.
— నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

తిరువనంతపురాన్ని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నిర్లక్ష్యం చేశాయి : ప్రధాని మోదీ
తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతి పాలన నుంచి కేరళను విముక్తి చేయాలనే దృఢ సంకల్పానికి లభించిన విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు తిరువనంతపురాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని నగరమైన తిరువనంతపురంలో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :