చర్లపల్లి టు తిరువనంతపురం – తెలంగాణకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

హైదరాబాద్ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 23;

తెలంగాణ వాసులకు నూతనంగా అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. కేరళలోని తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్‌పుర్‌ (బిహార్) మధ్య ఒక అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. అమృత్‌ భారత్‌ 2.0 రైలు (నంబర్ 17041) ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు తిరువనంతపురం నుంచి రైలు (నంబర్ 17042) బయలుదేరి గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ, నల్గొండ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని కిషన్‌ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌లో ఆర్‌ఏసీ టికెట్లు ఉండవు : చర్లపల్లి తిరువనంతపురం అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రిజర్వేషన్‌ అయిపోయాక ఆర్‌ఏసీ టికెట్లు, ఆ తరువాత వెయిటింగ్‌ లిస్టు టికెట్లు ఇస్తారు. అమృత్‌ భారత్‌లో ఆర్‌ఏసీ టికెట్లు ఉండవని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంటే, బెర్తుల వరకే టికెట్లు ఇస్తారు. వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులు రిజర్వేషన్‌ ఉన్న ప్రయాణికుల పక్కన కూర్చుని ఇబ్బంది పెట్టే పరిస్థితీ ఉండదు.

సామాన్య ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరం : అమృత్‌ భారత్‌లో ఏసీ కోచ్‌లు ఉండవు. జనరల్‌, స్లీపర్ బోగీలే ఉంటాయి. దీంతో సామాన్య ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 11 జనరల్‌ సెకండ్‌ క్లాస్, 8 స్లీపర్‌ కోచ్‌లు, 2 సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, దివ్యాంగుల ఫ్రెండ్ల్శీ, 1 ప్యాంట్రీ కార్‌ ఉంటాయి. శుక్రవారం ప్రధాని ప్రారంభించిన ఈ రైలు ప్రయాణికులకు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి వస్తుంది. అమృత్‌ భారత్‌ ఛార్జీలే అమృత్‌ భారత్‌ 2.0 రైల్లోనూ ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది. స్టేషన్ల వారీగా ఛార్జీలపై శుక్రవారం స్పష్టత రానుంది.

ప్రయాణ సమయం ఎక్కువే : –

  • సికింద్రాబాద్‌ నుంచి తిరువనంతపురానికి వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయం 27.36 గంటలు కాగా చర్లపల్లి తిరువనంతపురం అమృత్‌ భారత్‌ 2.0 ప్రయాణ సమయం 31.30 గంటలు.
  • గరిష్ఠ వేగం 130 కి.మీ.

అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రత్యకతలు : జర్క్‌లు లేని ప్రయాణం. మడత పెట్టుకునే స్నాక్స్‌ టేబుల్‌. మెరుగైన సీట్లు. ప్రతి ప్రయాణికుడికి మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌. ఆధునిక టాయిలెట్లు. ఎల్‌ఈడీ లైట్లు. టచ్‌ ఫ్రీ సబ్బు డిస్పెన్సర్లు. ప్రమాదాల సమయంలో ఎక్స్‌టర్నల్‌ ఎమర్జెన్సీ లైటింగ్‌ ఈ రైలు ప్రత్యేకతలు.

నాలుగు రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేరళలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్య ప్రాంతీయ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి సహాయపడే మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను, త్రిస్సూర్-గురువాయూర్ ప్యాసింజర్ రైలును, పూజప్పుర హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అలాగే సీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్టీ ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్‌, శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో అత్యాధునిక రేడియోసర్జరీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అలాగే పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు లబ్దిదారులకు క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :