ఫోన్​ ట్యాపింగ్ చట్టబద్ధమే – ఈ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావే నిజమైన బాధితులు’

హైదరాబాద్ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 23;

దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్‌ చేయటం చట్టబద్ధమేనని బీఆర్​ఎస్​ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ అన్నారు. ఫోన్లు, ఈ మెయిల్స్‌ ట్యాపింగ్‌ చేస్తున్నామని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్‌ జరుగుతున్నా, ఎక్కడా చర్చ జరగటం లేదని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నిజమైన బాధితులని పేర్కొన్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే నోటీసులు ఇస్తున్నారు : తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కేసీఆర్‌ కృషి చేశారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ సంపద రక్షణ కోసం కేటీఆర్‌, హరీశ్‌రావు వీరోచితంగా పోరాడుతున్నారని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పోరాడుతోందని వెల్లడించారు. నైనీ కోల్‌ బ్లాక్‌ దోపిడీని ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ బద్నాం చేశారని, కాంగ్రెస్‌ పార్టీ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం బజారున పడేసింది : ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని ప్రవీణ్​కుమార్ కోరారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్‌ చేయటం సర్వసాధారణమేనని తెలిపారు. దేశ భద్రత, అంతర్గత భద్రత కోసం ఫోన్లు ట్యాపింగ్‌ చేయొచ్చని చట్టమే చెబుతోందని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం బజారున పడేసిందని తెలిపారు. ఫోన్లు ట్యాప్‌ చేయాలని ఏ సీఎం, మంత్రి ఎస్‌ఐబీ అధికారులకు చెప్పరని అన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఎస్‌ఐబీతో సంబంధముండే అవకాశమే లేదని వెల్లడించారు. నేతల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేశారని అభాండాలు వేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌ అనేది దుర్వినియోగం జరిగిందనుకుంటే అధికారులను ప్రశ్నించాలని, అనాటి డీజీపీ, ఎస్‌ఐబీ అధికారులను వదిలేసి కేటీఆర్‌, హరీశ్‌రావును ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :