హైదరాబాద్ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 27;
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిట్ తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సీఆర్పీసీ 160వ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. ఇప్పటికే సిట్ అధికారులు బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారణ చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలను సిట్ విచారణ చేసింది.
అన్నింటికి సమాధానం ఇస్తా : సిట్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేత సంతోష్ రావు స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, రేపటి విచారణకు హాజరవుతానని తెలిపారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. రెండేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే మూడు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచారు. అంతకు ముందు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును విచారణ చేశారు.
వేగం పెంచిన సిట్ : వాస్తవానికి కేసు నమోదై దాదాపు రెండేళ్లు కావస్తున్నా దర్యాప్తు మాత్రం ఇంకా టీవీ సీరియల్లా కొనసాగుతూనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో పోలీసు అధికారులే నిందితులుగా ఉన్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. హరీశ్ రావు, తర్వాత కేటీఆర్, ఇప్పుడు సంతోష్ రావు, చివరగా మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును ముగించాలనే ఉద్దేశంతో సిట్ వేగం పెంచినట్లు కనిపిస్తోంది.
అసలేంటీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పలు రాజకీయ పార్టీల అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశం మొదట్లో తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసు ఉన్నతాధికారులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. వారిలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు ఉన్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహారించిన ప్రభాకర్‌రావుపై ఈ కేసులో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆయన వల్లే ఈ కేసు సుదీర్ఘంగా కొనసాగుతుందని ప్రచారం ఉంది.
వాంగ్మూలాల సేకరణ : దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ దర్యాప్తును వేగంగా చేపట్టింది. అందులో భాగంగా ఫోన్లు ట్యాప్ అయిన నేతలు ఈటల రాజేందర్, మహేశ్ కుమార్ గౌడ్, బండి సంజయ్ తదితర నాయకులను పిలిచి వారి నుంచి కీలక వాంగ్మూలం తీసుకుంది. తాజాగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ నడుపుతున్నాయని రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేకపోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే కేసీఆర్ కుటుంబం మొత్తం జైళ్లో ఉండేదని ఘాటుగా విమర్శించారు.









