హైదరాబాద్ ,డైలీ రిపోర్ట్ ,జనవరి 27;
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు అంతా సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫిషన్ విడుదల కానుంది. ఫిబ్రవ 11న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇవాళ తుది కసరత్తు పూర్తి చేయనుంది.
ఎన్నికల నోటిఫికేషన్ : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవాళ లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధత తెలుపుతూ ఈ నెల 19నే ఎస్ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఫిబ్రవరి 15లోగా ఎన్నికలు పూర్తి : ఈ నెల 24 వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి దశల వారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో : ఎస్‌ఈసీ నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని ఏడు కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2,630 వార్డుల్లో ఓటర్ల జాబితాలను ఎస్‌ఈసీ ప్రకటించింది. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా, మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది.









